నీతి కథ : కట్టతెగింది

Neeti kadha

సూరన్న పల్లెలో నివసిస్తూ వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం గడిపేవాడు. అతడి వివాహం కలవారి అమ్మాయితో చేయాలనేది తల్లిదండ్రుల ఆశ. కాయకష్టం చేసుకునే సూరన్నను కలవారి ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడానికి విముఖత చూపించారు. చేసేది లేక అదే పల్లెలోని ఒక పేదింటి అమ్మాయితో సూరన్నకు వివాహం జరిపించారు.

పెళ్లి కూతురు పేరు నీలవేణి. కొత్తగా పెళ్లి అవడంతో తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుంది నీలవేణి. చేసేది లేక పదిరోజులు తల్లిదండ్రుల వద్ద ఉండమని పంపారు. భార్యను చూడాలని బయలుదేరాడు సూరన్న. ‘అమ్మా! నేను అత్తవారింటికి వెళ్లి వస్తాను అని తల్లితో అన్నాడు సూరన్న. ‘బాబూ! నీ అత్తగారు కడు పేదవారు. వారి కుటుంబం ఒక చిన్న గుడిసెలో నివసిస్తుంది. అక్కడే తిష్టవేయకుండా భార్యను తీసుకుని వచ్చే§్‌ు. వాళ్లు కూడా పేదవారే. ఆ కుటుంబానికి నువ్ఞ్వ భారం కాకూడదు అని చెప్పింది తల్లి. ‘కాదమ్మా! నేను నాలుగు రోజులపాటు అక్కడ ఉండి రావానుకుంటున్నాను. ఎన్ని రోజులు ఉండమంటావో నువ్వే చెప్పు. అన్ని రోజులు ఉండి వస్తాను అన్నాడు సూరన్న.
‘కట్ట తెగిందాకా ఉండు అని చెప్పింది తల్లి.

సూరన్నకు కట్ట తెగడం అంటే ఏమిటో? అర్ధం కాలేదు. ఏది ఏమైనా నాలుగు రోజులు ఉండటానికి తల్లి అంగీకరించిందనే ఆనందంతో అత్తవారింటికి బయలుదేరాడు. మొదటి నాలుగు రోజులు అత్తవారింట్లో చక్కటి మర్యాదలు చేశారు. వేడివేడి అన్నం, నాలుగు కూరలు, గడ్డపెరుగుతో భోజనం పెట్టారు.

స్నానానికి వేడినీళ్లు పెట్టేవారు. సూరన్న ఆనందానికి అవధులు లేవ్ఞ. రాచమర్యాదలు అందుకుంటున్నంత సంతోషంతో రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. ఇంతలో నీలవేణికి జబ్బు చేసింది. ఆమెను తీసుకుని ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ తల్లి నిద్రాహారాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. కొంతకాలం మంచి పౌష్టిక ఆహారం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం కుదుట పడుతుందని వైద్యులు చెప్పారు.

డబ్బు నీళ్ల ప్రాయంలా ఖర్చు అయి ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. పై మనిషి పాతిక నష్టం అన్నట్లు ఆ ఇంట్లో వాళ్లకే సరైన వసతులు లేక అల్లాడుతుంటే అల్లుడి రూపంలో సూరన్న భారంగా తోచాడు. ఆరోగ్యం కుదుట పడిన తరువాత అమ్మాయిని పంపిస్తాము అని నీలవేణి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ సూరన్న లెక్కచేయకుండా అత్తవారింట్లోనే తిష్టవేశాడు. ప్రతిరోజు ఉదయాన్నే మంచి అల్పాహారం పెట్టేవారు. కానీ ఆ రోజు వ్యవహారం మారిపోయింది. ‘అల్లుడుగారూ! అమ్మాయి ఆరోగ్యం బాగా లేదు కదా! అల్పాహాయం చేయలేకపోయాము. ఈ పూటకు పచ్చడి వేసుకుని సద్ది అన్నం తినండి అని చెప్పింది అత్తగారు.

నాలుగు కూరలతో హాయిగా తినే సూరన్నకు పచ్చడి నచ్చలేదు. కనీసం పెరుగైనా వేసుకుని తిందాం అనుకున్నాడు. ‘అత్తగారూ! కొద్దిగా గడ్డపెరుగు వేయండి అని చెప్పి అన్నం మధ్యలో చిన్న గొయ్యి తీశాడు. ఆ గొయ్యి చుట్టూ అన్నం కట్టలా ఏర్పడింది. అత్తగారు అన్నం మధ్యలోని ఆ ఖాళీ స్థలం నిండా మీగడతో కూడిన గడ్డపెరుగు వేస్తే జుర్రుకుంటూ తినడం సూరన్నకు అలవాటు. కానీ ఆ రోజు అత్తగారు గడ్డపెరుగుకు బదులు పలుచని మజ్జిగ వేసింది.

అన్నం మధ్యలోని ఖాళీ స్థలం మజ్జిగతో నిండిపోయింది. అన్నంతో ఏర్పడిన కట్ట తెగిపోయి మజ్జిగ ఖాళీ స్థలం నుండి బయటకు వచ్చేసింది. కట్ట తెగిందాకా ఉండు అని తన తల్లి చెప్పిన మాటలు సూరన్నకు అప్పుడు గుర్తుకు వచ్చాయి. కట్ట తెగడం అంటే ఇదా? అని సూరన్నకు జ్ఞానోదయం అయి, అత్తగారి కుటుంబానికి తాను భారం కాకూడదని భావించి వెంటనే తన ఊరికి బయలుదేర ఏర్పాట్లు చేసుకున్నాడు

. ‘అత్తగారూ! నీలవేణికి ఆరోగ్యం కుదుట పడిన తరువాతే మా ఇంటికి పంపండి. నాకు వ్యవసాయం పనులు ఉన్నాయి. బయలుదేరతాను అని చెప్పి తన ఊరికి బయలుదేరాడు సూరన్న.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, తెనాలి

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com