రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడంపై శరద్ పవార్ క్లారిటీ

రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనన్న పవార్

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. రాష్ట్రపతి పదవి కోసం ఎవరెవరు బరిలోకి దిగొచ్చనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడంపై పవార్ క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని శరద్ పవార్ స్పష్టం చేశారు. అత్యున్నత పదవి కోసం విపక్షాల తరపు అభ్యర్థిని తాను కాదని చెప్పారు. ముంబైలో ఎన్సీపీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆయన పూర్తి స్పష్టతను ఇచ్చారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రతిపాదనను పవార్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేంత ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ప్రతిపక్షాలకు లేవు. ఈ కారణంగానే ఎన్నికల్లో పోటీ చేయడానికి పవార్ ఆసక్తిని చూపించడం లేదని చెపుతున్నారు. జులై 24న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియబోతోంది. ఈ లోగానే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/