రేపు గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన దగ్గరకు మోడీ

గుజరాత్‌ మోర్బీలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 141 మందివరకు మరణించారు. ఈ ఘటన స్థలానికి రేపు ప్రధాని మోడీ వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది.

అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బ్రిడ్జి కూలిన ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ విచారణ చేస్తోందని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు.

మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తీగల వంతెన ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ప్రమాదం జరిగాక కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగా, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే బ్రిడ్జి ఆధునీకరణ పనుల కోసం గత ఆరు నెలలుగా వంతెన పైకి సందర్శకుల్ని అనుమతించ లేదు. పనులు పూర్తి చేసిన తర్వాత గత ఐదు రోజుల నుంచి సందర్శకుల్ని అనుమతించారు. ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఎక్కువ మంది నడవటంతో పాటు జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు.