రాష్ట్రపతి ఎన్నికలకు 115 నామినేషన్లు దాఖలు ..

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలఫై అంత ఫోకస్ పెట్టారు. జులై 18 న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నిన్న బుధువారం తో నామినేషన్ల గడువు పూర్తయింది. మొత్తం 115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలిస్తారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని వాటిని తిరస్కరించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది.

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మొదలుపెట్టారు. నిన్న కేరళ కు వెళ్లారు. ఇక్కడ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేకపోవడంతో ఇక్కడి నుంచి తనకు ఎక్కువ ఓట్లు దక్కుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఈమేరకు సిన్హా తిరువనంతపురంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి మద్దతు కోరారు. జులై 02 న తెలంగాణ కు రానున్నారు. యశ్వంత్‌ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్న యశ్వంత్‌ సిన్హా.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. సీఎం, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో లంచ్‌ భేటీ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కాకుండా మరోచోట ఉంటుందని సమాచారం.