బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోడీ

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలపై ఎంపీలకు ప్రధాని మోడి దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భూకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. గుజరాత్ భూకంపం వల్ల దాదాపు 13 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కారణంతో టర్కీ ప్రజల కష్టాలను మోది అర్థం చేసుకోగలరని బిజెపి ఎంపీ మనోజ్ తివారి అన్నారు.

ఇక టర్కీ భూకంపం విషయానికి వస్తే.. సోమవారం టర్కీ తో పాటు సిరియా దేశాల్లో భారీ భూకంపాలు సంభవించగా..మంగళవారం మరోసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైనట్లు యూరోపియన్ మెడిట్టేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. సెంట్రల్ టర్కీ పరిధిలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భూప్రకంపనలకు బిల్డింగ్‌లు, రోడ్లకు బీటలు పడ్డాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

ప్రస్తుతం టర్కీ, సిరియాలో వరుస భూకంపాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నాల్గు వేలకు పైగా మృతదేహాలు బయటకు తీయగా..ఇంకా శిధిలాల కింద మృతదేహాలను వెలికితీత పనులు జరుగుతున్నాయి. వరుస భూకంపాలతో విలవిలలాడుతున్న టర్కీ, సిరియాలకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. భారత్ ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించగా.. స్పెయిన్ శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పిఫర్ డాగ్‌లను పంపించింది.