అదానీ ఆస్తులపై పార్లమెంట్‌లో రాహుల్ ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీః నేడు పార్లమెంట్‌లో అదానీ ఆస్తులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అదానీ సుమారు 10 రంగాల్లో వ్యాపారం చేస్తున్నారని, మరి 2104 నుంచి 2022 వరకు ఆయన ఆస్తులు 8 బిలియన్ల డాలర్ల నుంచి 140 బిలియన్ల డాలర్లకు ఎలా వెళ్లాయని యువత అడుగుతున్నారని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్ర సమయంలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ ప్రశ్నలు వేసినట్లు ఆయన తెలిపారు.
తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు అంతటా ఒక్కటే పేరు వినిపిస్తోందని, అంతటా అదానీ పేరే వినిపిస్తోందని రాహుల్ అన్నారు. అదానీ ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా అతను ఫెయిల్ కారని ప్రజలు అంటున్నట్లు రాహుల్ గుర్తు చేశారు. కశ్మీర్‌లోని యాపిళ్ల నుంచి.. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్డుల గురించి కూడా అదానీ పేరు వినిపిస్తోందని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలను ప్రస్తావించలేదన్నారు. అగ్నివీర్ పథకం ఆర్మీ ఆలోచన నుంచి రాలేదని, అది ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ ఆలోచన నుంచి వచ్చిట్లు రాహుల్ విమర్శించారు. అగ్నివీర్ పథకాన్ని బలవంతంగా ఆర్మీపై రుద్దినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఆయుధ శిక్షణ ఇచ్చి, వాళ్లను తిరిగి సమాజంలోకి పంపడం వల్ల హింస పెరుగుతుందని రిటైర్డ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు.