సుఖేష్ చంద్ర శేఖర్‌తో నాకు పరిచయం లేదు: ఎమ్మెల్సీకవిత

కెసిఆర్ ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కవిత

mlc-kavitha-clarity-on-chat-with-sukesh-chandrasekhar

హైదరాబాద్‌ః మనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ విడుదల చేసిన వాట్సప్ చాట్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అస్సలు సుఖేష్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారు కవిత. బిఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి చేస్తున్నారని.. ఫేక్ చాట్‌ విడుదల చేస్తూ తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సుఖేశ్ చంద్రశేఖర్‌తో తనకు ఏలాంటి పరిచయం లేదన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బిఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

బిఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను, జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామకుడు రాసిన లేఖను విడుదల చేయడం. దాని వెంటనే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం.. దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బిజెపి టూల్ కిట్‌లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని మండిపడ్డారు.

అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదన్నారు. అతనెవరో కూడా తనకు తెలియదన్నారు ఎమ్మెల్సీ కవిత. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో.. పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయన్నారు. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని,కెసిఆర్‌ని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు కవిత. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మీడియా సంస్థలు తయారయ్యని.. ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం.. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బిఆర్ఎస్ పార్టీ పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలి.. జాగ్రత్త పడాలన్నారు కవిత.