ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిజెపి లో చేరడం ఫై మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి పార్టీ లో చేరారు. గురువారం ఢిల్లీలో బీజేపీలో జేపీ నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. కాగా మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడడం ఫై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

మహేశ్వర్ రెడ్డి చర్య సూసైడ్ వంటిదని అభివర్ణించారు మహేష్ కుమార్ గౌడ్. ఒక నాయకుడి కోసం త్యాగాలు చేసే రోజులు కావని చెప్పారు. చాలా రోజులుగా పార్టీ మారేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ అనుమానంతోనే ఆయనకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మహేశ్వర్ రెడ్డి పోతే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఇవి కేవలం బిజెపి ఆడుతున్న చిల్లర డ్రామాలు అని ఆరోపించారు.

ఇక బిజెపి లో చేరిన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..మోడీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతం వస్తుందని ..మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు. కేసీఆర్ అరాచక పాలన అంతం చేయటం బీజేపీకే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాయన్నారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. నిస్తేజంగా ఉందన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కొందరు సీనియర్స్ అంటే.. పొత్తు లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని.. క్లారిటీ, నిబద్దత లేదని.. అంతా గందరగోళంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని.. పార్టీ వాళ్లు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు.