బిఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్‌ రాజీనామా

MLA Rekha Naik Resigns To BRS

హైదరాబాద్‌ః ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. శుక్రవారం ఖానాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆమె బిఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బిఆర్ఎస్‌లో మహిళలకు విలువ లేదంటూ కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి.. తన సత్తా ఎంటో చూపిస్తానని సవాల్ విసిరారు. రెవెన్యూ డివిజన్ అడిగితే ఇవ్వలేదని… కాళ్లు మొక్కినా కనికరించ లేదని వాపోయారు. తననే కాదు ఖానాపూర్ ప్రజలను బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. మహిళలకు బిఆర్ఎస్ లో చోటు లేదని… అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఖానాపూర్‌ గడ్డ.. రేఖానాయక్‌ అడ్డా అని… ఇక్కడ మరో నేతను గెలవనివ్వనంటూ కామెంట్స్ చేశారు.

కాగా, తాను ఏ పార్టీ తరఫున పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానన్నారు. మంత్రి కెటిఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? కుంభకోణాలకు పాల్పడ్డానా? టిక్కెట్ ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చిన జాన్సన్ ఎస్టీ కానే కాదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన నియోజకవర్గానికి నిధులు ఆపేశారన్నారు. ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ సవాల్ చేశారు. తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. తనకు అనవసరంగా టిక్కెట్ నిరాకరించారంటూ రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏడిపించడం ఖాయమన్నారు.