ఎమ్మెల్యే జోగు రామన్నకు మాతృ వియోగం

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి భోజమ్మ(98) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. ఈరోజు ఉదయం కన్నుమూశారు. భోజమ్మ మృతి పట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

ఇక ఎమ్మెల్యే జోగు రామన్న విషయానికి వస్తే ప్రస్తుతం టిఆర్ఎస్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న, దీపాయిగుడ గ్రామానికి సర్పంచ్‌గా జైనాథ్ మండల ఎంపిటిసి, జెడ్‌పిటిసిగా పనిచేశాడు. 2009లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సి. రామచంద్రారెడ్డి పై 25,580 ఓట్ల మెజారిటీతో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడుగా గెలుపోందాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరుపై నాగం జనార్ధన్ రెడ్డితో కలిసి పోరాడి 2011, అక్టోబరు 10న టిడిపి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. అనంతరం 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున పోటిచేసి మరలా అదే అభ్యర్థిపై గెలుపొందాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ పై 14711 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014, జూన్ 2వ తేదీన కెసీఆర్ తొలి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తనవంతు కృషిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ పై 25,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.