కొల్లాపూర్ హైటెన్షన్ వాతావరణం : పోలిసుల అదుపులోకి ఎమ్మెల్యే హర్షవర్ధన్

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో.. కొల్లాపూర్ అంత టెన్షన్ మొదలైంది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసరగా.. డైరెక్టుగా ఇంటికే వస్తానని ఎమ్మెల్యే హర్షవర్ధన్ చెప్పారు. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇద్దరు నేతల ఇళ్లకు చేరుకున్నారు. బహిరంగ చర్చకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు.

దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బహిరంగ చర్చకు అనుమతించేది లేదని చెప్పారు. వారి ఇళ్ల దగ్గర భారీగా మోహరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీస్ వాహనాలను కార్యకర్తలు అడ్డుకున్నారు. జూపల్లి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. కొంత కాలంగా కొల్లాపూర్ TRSలో జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్ స్వయంగా జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లడంతో అంతా సెట్ రైట్ అయ్యిందనుకున్నారు. కానీ అనూహ్యంగా మరోసారి ఇద్దరు నేతలు బహిరంగ ఆరోపణలతో రచ్చకెక్కారు.