కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు విలువ చెప్పాలంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్

KCR family properties

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తులు విలువ చెప్పాలంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేసారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాల్గొవ విడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారంతో ముగిసింది. ఈ ముగింపు సభలోఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ట్విట్టర్ పిట్ట కూతలు కూస్తుందంటూ మంత్రి కేటీఆర్ ఫై నిప్పులు చెరిగారు. రైతులపై మొసలి కన్నీరు కార్చే టీఆర్ఎస్ సర్కార్‌కు యూపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కులేదంటూ లక్ష్మణ్ మండిపడ్డారు. రూ.36 లక్షల కోట్లతో 86 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కే దక్కుతుందన్నారు.

కొలువుల కోసం రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకుంటే.. కేసీఆర్ ఇంట్లో వాళ్లకు మాత్రమే అన్ని పదవులు వచ్చాయంటూ కె.లక్ష్మణ్ విమర్శించారు. కేటీఆర్ కొడుక్కి వయస్సు లేక ఆ బుడ్డోడికి పదవి ఇవ్వలేదని.. లేకపోతే రాజ్యసభనో, దొడ్డిదారిలో ఎమ్మెల్సీ పదవో ఇచ్చేవారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని.. హైదరాబాద్ నగరంలో చెల్లించే పన్నులతో గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటలను అభివృద్ధి చేసుకుంటాన్నరని ఆయన ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం ఆస్తులెన్ని? ఇప్పుడు ఆస్తులెంత అంటూ కె.లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు.