ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు : భారీ మెజార్టీ దిశగా వైసీపీ

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ తాలూకా లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు 13 రౌండ్స్ పూర్తికాగా ఈ 13 రౌండ్లలో వైసీపీ మెజార్టీ కనపరిచింది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 66,650 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేశ్‌కుమార్‌, రిటర్నింగ్‌ అధికారి హరేంధిర పరిశీలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తుది ఫలితం వెలువడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.