టాలీవుడ్ మరో విషాదం : ‘మిధునం’ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ఒకరు కాకపోతే ఒకరు మరణిస్తున్నారు. తాజాగా గురువారం ‘మిధునం’ నిర్మాత మొయిద ఆనంద రావు(57) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. స్వచ్ఛంద కార్యక్రమాలతో అందరి అభిమానం పొందిన ఆనంద రావు మృతికి సినీ ప్రముఖులతో పాటు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.

విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామంలో ఆనంద రావు జన్మించారు. సాధారణ చిరు ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి.. వ్యాపారవేత్తగా ఎదిగారు. మంచి పనులకు ముందుండే ఆనందరావు సంఘసేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు సాహిత్యం అన్నా.. పర్యావరణం అన్నా ఎంతో ప్రేమ. అంతే కాదు స్వతహాగా కవిత్వాలు, పద్యాలు రాసి.. కోటిగాడు పేరుతో ప్రచురించారు ఆనందరావు. ఆయన గ్రామంలో 25 లక్షలు ఖర్చుచేసి గ్రంథాలయం ఏర్పాటుచేశారు.

గాయకుడు, నటుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రలుగా.. నటులు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో మిథునం సినిమా ను నిర్మించారు. అందరు నిర్మాతల్లా కమర్షియల్ గా ఆలోచించకుండా మిథునం సినిమాతో అందరిని ఆలోచింపచేశారు. 2012 లో రిలీజ్ అయిన మిథునం సినిమా.. 2017 లో నందీ అవార్డ్ ను సొంతం చేసుకుంది.