డీజే టిల్లు తో మాస్ స్టెప్స్ వేసిన మంత్రి మల్లారెడ్డి

బిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి తనలోని టాలెంట్ ను బయటకు తీస్తూ అందర్నీ అలరిస్తుంటారు. తాజాగా డీజే టిల్లు గా మారాడు. కుత్భుల్లాపూర్ మైసమ్మ గూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతే కాదు ఈ కార్యక్రమంలో హీరో సిద్ధూ, దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ బాబీ, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో డీజే టిల్లు సినిమాలో మాస్ సాంగ్ అయిన టైటిల్ సాంగ్ డీజే టిల్లుకు హీరో సిద్ధుతో పాటు మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. డీజే టిల్లు పాటకు హీరో సిద్ధు మంత్రి మల్లారెడ్డితో సిగ్నేచర్ స్టెప్పులు వేయించారు.

ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..మల్లారెడ్డి కళాశాలలో ఇంత పెద్ద ఎత్తున పిల్లల కోసం ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చదువుతో పాటు, మానసిక ఉల్లాసం తోడయ్యేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కొత్త సినిమా వాల్తేరు వీరయ్యలోని 4వ పాటను దేవి శ్రీ ప్రసాద్, శేఖర్ మాస్టర్, డైరెక్టర్ బాబీతో కలిసి మంత్రి విడుదల చేశారు. ఇక మంత్రి మల్లారెడ్డి, హీరో సిద్ధూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.