కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిందిః మంత్రి కెటిఆర్‌

minister-ktr

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టేఫలి అని విశ్వసించే పవర్‌లూం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిందని చెప్పారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండదండగా నిలబడుతోందని కెటిఆర్‌ అన్నారు.

తెలంగాణ ఏర్పడకముందు గత పాలకుల హయాంలో నేత కార్మికుల బతులకు గాలిలో దీపంలా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు.’ఆనాడు చేతినిండా పనికి దొరికేది కాదు. తగిన మార్కెట్‌ కానీ.. అమ్మకాలు కానీ లేని పరిస్థితి ఉండేదని.. ప్రభుత్వం నుంచి తగిన మద్దతు ధర లభించక, తదితర కారణాలతో చేనేత రంగం కృషించిపోయింది. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే దుర్బర పరిస్థితులు దాపురించాయని’ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండదండగా నిలబడుతోందని తెలిపారు. ‘ మరమగ్గాల కార్మికులు, ఆసాములకు నిరంతరం ఉపాధి కల్పించడానికి 2500 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తి చేసింది. క్రిస్మస్, రంజాన్‌ తదితర చీరల అనుమతులను కూడా ఇక్కడి పవర్‌లూం వర్కర్స్‌కే ఇస్తున్నది. ఈ ప్రభుత్వ ఆర్డర్‌ వల్ల 15వేలకు పైగా కార్మికులు నెలకు ఒక్కొక్కరు 16వేలకు పైగా వేతనాన్ని పొందుతున్నారు.’ అని తెలిపారు.

‘ సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూర్‌లో 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల వ్యయంతో అపారెల్‌ పార్క్‌ పనులు, 88 ఎకరాల స్థలంలో రూ.388 కోట్లతో వీవింగ్‌ పార్క్‌ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. 4.50 కోట్లతో గోకుల్‌దాస్‌ ఇమేజెస్‌ పరిశ్రమ స్థాపించబడి 950 మందికి ఉపాధి కల్పిస్తున్నది. అపారెల్‌ పార్క్‌ నిర్మాణం పూర్తయితే దాదాపు 8వేల మంది మహిళలకు ప్రత్యక్షంగా గార్మెంట్‌ రంగంలో ఉపాధి లభిస్తుంది. అపారెల్‌ గార్మెంట్‌ రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం ద్వారా 2500 మందికి ఇప్పటికే శిక్షణ అందించడం జరిగింది.’ అని అన్నారు.

‘ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా నేతన్నకు బీమా అనే పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కార్మిక క్షేత్రమైన సిరిసిల్లతో సహా తెలంగాణలోని దాదాపు 8వేల మంది నేత, పవర్‌లూం వర్కర్లకు ఈ బీమా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తూ ఏ నేత కార్మికుడైన మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు అందించే ఈ పథకం.. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఇది నేత కార్మికుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం. ఎన్ని కష్టాలను తట్టుకుని చేనేత రంగానికి, పవర్‌లూం రంగాలపై ఆధారపడ్డ కుటుంబాలకు అన్ని వేళలా రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది. ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60 మంది నేత కార్మికులు, 4644 మంది మరమగ్గాల కార్మికులను నేతన్న బీమా పథకంలో నమోదు చేయడం జరిగింది. ఈ పథకంలో నమోదై మరణించిన 8 మంది నేతన్న కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా అందజేశాం. ‘ అని తెలిపారు.