హుజూరాబాద్‌ ఫలితంపై మంత్రి కేటీఆర్‌ స్పందన

ఈ ఒక్క ఓటమితో కోల్పోయేదేమీ లేదు… ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం: కేటీఆర్

హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందని, ఈ ఒక్క ఫలితంతో కలిగే నష్టం కానీ, పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ బరిలో ఎంతో స్ఫూర్తిదాయక పోరాటం సాగించిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.

భవిష్యత్తులో జరిగే ఎన్నికల యుద్ధాల్లో రెట్టించిన ఉత్సాహంతో పోరాడుదామని టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ లో పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారంటూ హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, కమలాకర్ లకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా, హుజూరాబాద్ లో పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా యోధులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/