మా హయాంలో ఐటీ, వ్యవసాయం పెరిగింది.. అవతలివాళ్లు అరవై ఏళ్లు ఏం చేశారు? : కెటిఆర్‌

హైదరాబాద్ అభివృద్ధిపై కొన్ని ఆలోచనలు ఉన్నాయన్న మంత్రి కెటిఆర్‌

minister-ktr-interesting-comments-on-brs-ruling

హైదరాబాద్‌: తమకు అహంకారం లేదని.. తెలంగాణపై చచ్చేంత మమకారం ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రతిపక్షాలు తెరపైకి తీసుకు వస్తున్నాయని మండిపడ్డారు. బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ… తమకు సమర్థవంతంగా పని చేసేందుకు ఆరున్నర సంవత్సరాలు మాత్రమే సమయం దొరికిందన్నారు. కానీ అవతలి వాళ్లు అరవై ఏళ్ళు పాలించి చేసిందేమీ లేదని విమర్శించారు.

తమ హయాంలో ఐటీ పెరిగిందని.. వ్యవసాయం ఉత్పత్తి పెరిగిందని గుర్తు చేశారు. ఓ వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయని… మరోవైపు పచ్చదనం అదేస్థాయిలో పెరుగుతోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక నిరక్షరాస్యత లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీసుకొని ఇల్లు కొంటున్న మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తరఫున సహకారంపై కెసిఆర్ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయని, వాటిని అమలు చేస్తామన్నారు.

ప్రధాన రోడ్లలో సైకిల్ ట్రాక్, మెట్రో రైలు స్టేషన్ల నుంచి షటిల్ సర్వీసులు, మరిన్ని పార్కులు, గ్రీనరీని అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్యం తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తామన్నారు. 24 గంటల నిరంతర నీటి సరఫరా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న అయిదేళ్లలో మెట్రోని 250 కిలో మీటర్ల మేర విస్తరిస్తున్నామని, మెట్రోను డబుల్ డెక్కర్ చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో తీసుకురావాలనే ఆలోచన ఉందన్నారు.