ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన జగన్ కు లేదు: దేవినేని ఉమ

ప్రాజెక్టును పూర్తి చేయలేక చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపణలు

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతిః టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. లోయర్ కాఫర్ డ్యాం నుంచి ఇసుక రవాణాకు పాల్పడి ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. టిడిపి హయాంలో చేసిన డయాఫ్రం వాల్ పనులకు రీయింబర్స్ మెంట్ ఇస్తే… దాన్ని లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులుగా ఇవ్వడం బాధాకరమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం చేతకాక చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ నేతలపై బురద చల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, టిడిపి నేతలను జైళ్లలో పెట్టడం తప్ప… రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు లేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో కమిషన్లను జగన్ దండుకున్నారని అన్నారు. ప్రధాని మోడీకి ఇచ్చిన వినతి పత్రాన్ని కూడా మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఇది ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.

వైఎస్‌ఆర్‌సిపికి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యలు ఉండి కూడా విభజన హామీలను సాధించలేకపోతున్నారని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలన్నా అనుమతి కావాలని వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెపుతున్నారని… ఇంత కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని అన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/