కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరిగేకొద్దీ.. ఐటీ, ఈడీ దాడులు పెరుతున్నాయి : రేవంత్ రెడ్డి

వివేక్ కుటుంబంపై జరిగిన ఐటీ దాడిని కాంగ్రెస్ మీద జరిగిన దాడిగా భావిస్తామన్న టీపీసీసీ చీఫ్

Congress win increase.. IT and ED attacks are increasing: Revanth Reddy

హైదరాబాద్‌ః ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను ఈసీ కాపాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల తరఫున పోరాడేవారు ద్రోహులు అవుతారా? బిజెపి, బిఆర్ఎస్ పార్టీలో చేరినవారు పవిత్రులు అవుతారా? అని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లుగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వివేక్ వెంకటస్వామి కుటుంబం సహా కాంగ్రెస్ నాయకుల ఇళ్ళు, కార్యాలయాలలో జరిగిన ఐటీ దాడులను తాము కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ద సంస్థలను ప్రధాని నరేంద్రమోడీ, కెసిఆర్ పావులుగా ఉపయోగించుకుంటున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పెరిగేకొద్దీ ఐటీ, ఈడీ దాడులు పెరుగుతున్నాయన్నారు. ప్రశ్నించే గొంతులే మిగలకూడదనేది బిజెపి – బిఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఎద్దేవా చేశారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడి నుంచి అందుతున్నాయని ప్రశ్నించారు. గడిచిన పదేళ్లలో మోడీ, అమిత్ షా ఆదేశాలు లేకుండా… విచారణ సంస్థల్లో చీమ చిటుక్కుమనలేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరు ఉన్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.