సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ కు భూమి పూజ చేసిన మంత్రి కెటిఆర్‌

6 నెల‌ల్లోనే ట్రాక్‌ను పూర్తి చేయ‌నున్నామ‌న్న మంత్రి

minister-ktr-foundation-stone-for-solar-roof-cycle-track

నెల్లూరుః హైదరాబాద్ నానక్ రామ్ గూడ వద్ద ఓఆర్ఆర్‌పై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటుకు
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ మంగళవారం శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో ట్రాక్‌ను శంకుస్థాపన చేశామన్నారు. గత ఆరు నెలల కిందట ఓ మిత్రుడు సౌత్‌ కొరియాలో సైక్లింగ్‌ ట్రాక్‌ ఉందని, హైవే మధ్యలో సోలార్‌ ప్యాన్లతో కట్టారు.. చూడడానికి బాగుంది.. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భారత్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు.. ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని’ అని సూచించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్‌ కొరియాకు వ్యక్తిగతం పంపామని, ఆ తర్వాత దుబాయిలో బాగుందంటే వెళ్లి అక్కడి మోడల్‌ను స్టడీ చేశారన్నారు. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్‌ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్‌ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లికి రాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం సైతం బాగుంటుందన్నారు.

ప్రస్తుతం అందరికీ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగిందన్నారు. 24 గంటలు ఈ ట్రాక్‌ అందుబాటులో ఉంటుందని, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరికీ ఉత్సాహపరిచేలా భారత్‌లో తొలిసారిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. శంకుస్థాపన చేయడంతో పాటు మోడల్‌ డెమో కింద 50 మీటర్లు తయారు చేశామన్నారు. జర్మనీ, సౌత్‌ కొరియా, ఇతర దేశాలకు దీటుగా నాలుగున్నర మీటర్ల వైశాల్యంతో ప్రపంచ స్థాయి నిర్మించామన్నారు. భవిష్యత్‌ అంతర్జాతీయ సైక్లింగ్‌ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడెల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను.. 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకున్నది. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/