మనసున్న మానవత్వం

జీవన వికాసం

Rekha Rao
Rekha Rao

సంకల్పబలం గట్టిగా ఉంటే మార్గం అదే గోచరిస్తుంది. ఒకరికి సాయపడటానికి స్వయంగా వెళ్లి చేయలేని పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంట్లో ఉంటూనే ఆపన్న హస్తాన్ని అందివచ్చు.

కరోనా సమయంలో ఎందరో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తిండి లేక, ఉపాధి లేక మరోచోటికి వెళ్లలేక నానా కష్టాలు పడ్డారు.

ఇంటి నుంచే పేదలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచారు ప్రొఫెసర్‌ రేఖారావు.

.వృత్తిరీత్యా ప్రొఫెసర్‌ అయిన రేఖారావు సామాజిక సేవలో ముందుంటారు. మురికివాడల్లోని పిల్లలకు చదువ్ఞ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు.

పదివరకు చదివిన వారిని ఏ ఏ రంగాల్లో రాణించవచ్చో తెలిపే అవగాహన సదస్సులు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు.

ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో బస్తీలో నివసించే మహిళలకు తెలియచేస్తుంటారు.

ఆర్గానిక్‌ నాప్‌కిన్స్‌ను పంపిణీ చేస్తారు. సామాజిక మాధ్యమాల్ల చురుగ్గా పాల్గొనే రేఖారావు కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల వల్లే ఎందరికో సహాయం చేశారు.

కరోనా సమయంలో ప్రభుత్వాధికారులకు, సామాజిక సంస్థలకు, నిరుపేదలకు మధ్య వారిధిగా నిలిచారు.

లాక్‌డౌన్‌ సమయంలో తనకు వచ్చిన ఒక ఫోన్‌కాల్‌కు స్పందించి ఆకలితో ఉన్న 50 కుటుంబాల వారికి స్థానిక పోలీసుల ద్వారా వారికి ఆహారాన్ని అందించేలా చేశారు.

రెండుపూటలా వారికి ఆహారం అందేలా ఏర్పాటు చేశారు. అలా ఎవరి నుండి ఎక్కడి నుండి అటువంటి ఫోన్‌కాల్స్‌ వచ్చినా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ట్విటర్‌ వేదికగా తానే స్వయంగా ప్రభుత్వ అధికారులను సంప్రదించి ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించేలా కృషి చేశారు.

అదేవిధంగా నానా అవస్థలు పడుతున్న కొంత మంది శిల్పకళాకారులకు కూడా తన వంతుగా సహాయపడ్డారు. ప్రభుత్వాధికారులతో మాట్లాడి వారికి బస ఏర్పాటు చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు.

మానవత్వం మూర్తీభవించిన రేఖారావు సహాయం ఆర్థిస్తూ ఫోన్‌ చేసే వారికి తన వంతుగా సహాయం చేయడానికి వెనుకాడరు. పేదలకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సాయాన్ని కూడా కోరతారు.

రేఖారావు ప్రొఫెసర్‌ మాత్రమే కాదు మంచి వ్యాఖ్యాత్రి కూడా. గణతంత్ర దిన్సోత్వం, స్వాతంత్రదినోత్సవ సందర్భాల్లో ఉన్నతాధికారుల సమావేశాలకు ఆమె వ్యాఖ్యాత్రిగా వ్యవహరిస్తారు.

తన పేరు రేఖ అయినా ఎప్పుడూ గీత గీసుకుని ఉండనంటారు (నవుతూ).

ఒకరికి తన వలన మంచి జరిగితే ఎంతో సంతోషిస్తానంటారు. సేవా కార్యక్రమాల్లో తన కుమారున్ని కూడా పాలుపంచుకునేలా చేస్తారు.

ఎందుకంటే పిల్లలకు మంచి విషయాలు తల్లిదండ్రుల నుండే అలవడతాయంటారు. ఆమె భర్త బాలాజీ ఆర్మీలో కల్నల్‌. వీరి సేవలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షిద్దాం.

  • పాలపర్తి సంధ్యారాణి

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/