మెహిదీపట్నంలో ఫేమస్ థియేటర్ కూల్చివేత

కరోనా మహమ్మారి చిత్రసీమను మాత్రమే కాదు థియేటర్ యజమాన్యులను సైతం కంటతడి పెట్టించింది. ఈ కరోనా దెబ్బకు హైదరాబాద్ మహానగరంలో పలు థియేటర్స్ మూతపడగా..ఇప్పుడు మెహిదీపట్నం లోని అందరికి సుపరిచితమైన అంబా థియేటర్‌ ను నేలమట్టం చేసారు. మల్టీప్లెక్స్‌లు లేని సమయంలో అంబా థియేటర్ కు జనాలు పరుగులు పెట్టేవారు. అప్పట్లో ఈ థియేటర్‌లో సినిమా చూడాలంటే కొన్ని రోజుల ముందే టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది.

కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్‌ అప్పటి నుంచీ తెరుచుకోలేదు. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేశారు. అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారా..? లేక మల్టీఫ్లెక్స్‌ నిర్మిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది. 1979లో 4,500 గజాల స్ధలంలో అంబా థియేటర్‌ ప్రారంభమైంది. ప్రేక్షకులు రాకపోవడంతోనే కూల్చివేశామని యజమాని డాక్టర్‌ బి కృష్ణారెడ్డి. నిర్వాహకుడు నిమ్మల సదానందం గౌడ్‌ తెలిపారు. లంగర్‌హౌస్‌ అలంకార్‌ థియేటర్‌ కూడా నడవడం లేదని, ఆదివారం మూడు షోలకు ప్రేక్షకులు లేకపోవడం చాలా బాధ అనిపించిందని సదానందం గౌడ్‌ తెలిపారు. త్వరలోనే దీనిని కూడా వేరే సంస్థకు అప్పజెపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

కరోనా కారణంగా టోలిచౌకి గెలాక్సీ థియేటర్‌, బహదూర్‌పురాలోని శ్రీ రామ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ మయూరి, నారాయణగూడలోని శాంతి థియేటర్లు మూత పడ్డాయి. మల్టీఫ్లెక్స్‌లతో పోటీ ఉన్నప్పటికీ ఈ ఐదు థియేటర్ల యజమానులు పెద్ద పెద్ద సినిమాలను విడుదల చేస్తూ సామాన్యులకు వినోదాన్ని అందించేవారు. కానీ కరోనా తర్వాత ఇవి తెరుచుకోలేదు. మరి వీటిని కూడా కూల్చేస్తారో లేదో అనేది చూడాలి.