సింధుకు పద్మభూషణ్‌ అవార్డు

P. V. Sindhu
P. V. Sindhu

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు మరో అపూర్వ గౌరవం దక్కింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్‌’ అవార్డుకు భారత ప్రభుత్వం ఆమెను ఎంపిక చేసింది. మహిళా స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్‌’ అందుకోనుంది. 71వ గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా పలురంగాల్లో విశేష కృషి చేసిన భారతీయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల జాబితాలో మొత్తం ఎనిమిది మంది క్రీడాకారులకు చోటుదక్కింది. 2012లో 17 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌లలో టాప్‌20లో అడుగుపెట్టడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సింధు.. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం గెలుచుకొనే వరకు ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ఐదేళ్ల క్రితం 2015లో సింధుకు పద్మశ్రీ దక్కింది. గతేడాది జరిగిన ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గిన 24 ఏళ్ల సింధు కెరీర్‌లో రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/