మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి..

హైదరాబాద్ లోని మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తన సిబ్బందితో కలిసి ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేట్ లేకుండా మోటారు సైకిల్‌తో వస్తుండం చూసి వారిని ఆపారు. ఇద్దరిని విచారిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు.

కడుపు, వెన్ను భాగంలో పొడిచాడు. అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావమైన ఎస్సై వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని గీత నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. కడుపు భాగంలో నాలుగు, వెన్నులో నాలుగు కుట్లు వేశారు. ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను లంగర్‌హౌస్‌లోని సంజయ్‌ నగర్‌లో నివాసముండే పవన్‌, సంజయ్‌గా గుర్తించారు. నిందితులు పీడీయాక్ట్‌ కింద జైటుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తులుగా గుర్తించారు.