రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌, సప్లైపై సీఎం జగన్ ఆరా

రైతు ఖాతాలో ఉచిత విద్యుత్ డ‌బ్బు… బిల్లులు రైతులే చెల్లిస్తారు: ఏపీ సీఎం జ‌గ‌న్‌

అమరావతి: ఏపీలో రైతుల‌కు ఉచిత విద్యుత్‌కు సంబంధించి వైస్సార్సీపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ దిశ‌గా సీఎం జ‌గ‌న్ బుధ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇంధ‌న శాఖ‌పై బుధ‌వారం జ‌రిగిన స‌మీక్ష‌లో భాగంగా మాట్లాడిన జ‌గ‌న్‌… ఉచిత విద్యుత్‌కు చెందిన డ‌బ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జ‌మ చేస్తామ‌న్నారు. ఆ త‌ర్వాత విద్యుత్ బిల్లుల‌ను రైతులే చెల్లిస్తారని ఆయన అన్నారు. ఈ ప‌ద్ద‌తి అమ‌లైతే విద్యుత్ సేవ‌ల‌కు సంబంధించి రైతు ప్ర‌శ్నించ‌గ‌లుగుతాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

స‌మీక్ష‌లో భాగంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌. సప్లై, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలను జ‌గ‌న్ సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును కొనుగోలు చేశామన్న అధికారులు… మార్చిలో 1268.69 మిలియన్‌ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని తెలిపారు. ఏప్రిల్‌లో 1047.78 మిలియన్‌ యూనిట్లను రూ.1022.42 కోట్లతో కొన్నామని వెల్ల‌డించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/