ఆస్కార్‌ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగు వారిపై వివక్ష చూపుతుంది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆస్కార్‌ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగు వారిపై వివక్ష చూపుతుందని కీలక వ్యాఖ్యలు చేసారు బిఆర్ఎస్- మంత్రి శ్రీనివాస్ గౌడ్. యావత్ తెలుగు ప్రజలు గర్వగా చెప్పుకునే సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి దక్షిణాది సాంగ్ గా నాటు నాటు నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది.

ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆనందం మాటల్లో చెప్పలేం. ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ సినిమాలో ‘అప్లాజ్’, బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ‘దిస్ ఈజ్ లైఫ్’, టాప్ గన్ మావెరిక్ సినిమాలో ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలను వెనక్కి నెట్టి మరీ ‘నాటునాటు’ పాట ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డు దక్కడం పట్ల సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , ఇతర రంగాలవారు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సరికొత్త చర్చకు దారి తీశారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి.. ఆస్కార్‌ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగు వారిపై వివక్ష చూపిందని ఆరోపించారు. నార్త్‌ ఇండియా సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత సౌత్ ఇండియా సినిమాలకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్‌కు అధికారికంగా ఎందుకు పంపలేదన్నారు. గుజరాత్ సినిమాను ఆస్కార్‌కు పంపి.. ఆర్ఆర్ఆర్ ను పంపకపోవడం తెలుగు వారిపై కేంద్రం వివక్షతకు సాక్ష్యం అని ఆరోపించారు. తెలుగు వారిపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ మంత్రి ఆరోపించారు. మరి ఈ ఆరోపణలు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు.