‘మా’లో చాలా సమస్యలున్నాయి

వాళ్లు హద్దు దాటి మాట్లాడితే.. వాళ్ల బండారాలన్నీ బయట పెడతా: మంచు విష్ణు వార్నింగ్

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వివాదం రానురాను మరింత ముదురుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన మంచు విష్ణు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లాల్సిన వారంతా బయట తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు వంటి పెద్దలున్న కాలంలో ఎలాంటి సమస్యలొచ్చినా.. వారు ముందుండి తీర్చేవారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయిందన్నారు. అసలు ‘మా’ శాశ్వత భవనం ఎజెండాగా అందరూ పనిచేస్తున్నారని, కానీ వేరే సమస్యలు చాలానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా సినీ ఇండస్ట్రీ పెద్దలే మొదట తనను కోరారని ఆయన చెప్పారు. అప్పుడు పోటీకి రాని వారెవరూ.. ఇప్పుడు పోటీలోకి వచ్చారన్నారు. పరిశ్రమలో ఎందరికో తాను సాయం చేశానని, ఆ పేర్లను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని తెలిపారు. కొందరు జైలుకెళ్లకుండా బయట తిరుగుతున్నారని, వారుగానీ హద్దు దాటి మాట్లాడితే వారి బండారాలన్నీ బయట పెడతానని ఆయన హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/