సలేశ్వరం యాత్రలో అపశృతి..ఇద్దరు భక్తులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భక్తుల రద్దీ కారణంగా ఊపిరి ఆడక ఇద్దరు భక్తులు కన్నుమూశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందగా, వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన అభిషేక్ (32) అనే యువకుడు ఊపిరి ఆడక మృతిచెందారు.

నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరంలో కొలువై ఉన్న శివుడిని (లింగమయ్య) దర్శించుకోవాలంటే దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 5 కి.మీ. దూరం కాలినడకన నడవాలి. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా… అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.