కొమరంభీం జిల్లాలో వంతెన ధాటుతుండగా వ్యక్తి గల్లంతు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్త వహిస్తున్నారు. ఇదిలా ఉంటె కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగులో మల్లయ్య అనే వ్యక్తి వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉదృతి ఎక్కువ కావడం తో గల్లంతయ్యాడు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాగజ్ నగర్ మండలం అందేవెల్లి పెద్దవాగు ఉదృతగా ప్రవహిస్తుంది. దహేగాం మండలం భిబ్రా గ్రామానికి చెందిన మల్లయ్య ఎవరు చెప్పిన వినకుండా వంతెన దాటే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో వరద ఉదృతి ఎక్కువ కావడం మల్లయ్య వరదలో కొట్టుకుపోయాడు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు అందేవెల్లి బ్రిడ్జి కూలిపోగా రెండు మండలాల ప్రజలు తాత్కాలిక వంతెనను నిర్మించారు.ఈ వంతెన కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు తప్పేట్టు లేవని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావం తో ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని కేంద్రం సంచాలకురాలు నాగరత్న ప్రకటించారు.

సిద్దిపేట జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిరుదొడ్డి మండలం కూడవెల్లి వాగులోని చెక్‌డ్యామ్‌లు నిండి దిగువకు వరద ఉరకలెత్తుతున్నది. దుద్దెడ శివారులో వరద నీటితో లోతట్టు ప్రాంతం జలమయమైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 16.3 సెం.మీ, కొండపాకలో 13, మిరుదొడ్డిలో 12.6, ధూల్‌మిట్టలో 12, సిద్దిపేట అర్బన్‌లో 11.6, కొమురవెల్లిలో 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది.