దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!

రాళ్లతో నింపిన డ్రమ్మును పట్టాలపై ఉంచిన దుండగులు

major-train-accident-averted-after-driver-spot-drum-filled-with-stones-kept-on-railway-track

ముంబయిః ముంబయి – సికింద్రాబాద్‌ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి రైలును ఆపారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన.

ముంబయి నుంచి సికింద్రాబాద్‌ బయల్దేరిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం తెల్లవారుజామున సతోనా – ఉస్మాన్‌పుర్‌ స్టేషన్ల మధ్య వెళ్తుండగా.. పట్టాలపై ఏదో వస్తువు ఉండటాన్ని లోకోపైలట్‌ గుర్తించారు. వెంటనే అప్రమత్తమై రైలును ఆపారు. కిందకు వెళ్లి చూడగా.. ట్రాక్ మధ్యలో రాళ్లలో నిండిన డ్రమ్ము కనిపించిది.

దీంతో రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్‌పీఎఫ్‌)కి లోకోపైలట్‌ సమాచారమిచ్చారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని డ్రమ్మును తొలగించారు. తర్వాత రైలు సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.

మరోవైపు ఈరోజు హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రయాణికులు వెంటనే కిందికి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో 3 బోగీలు పూర్తిగా కాలిపోగా, మరో నాలుగు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మిగతా 11 బోగీలను సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలించారు.