చైత్ర కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్ధిక సాయం చేసిన తెలంగాణ సర్కార్

సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారి ని అత్యాచారం చేసి , హత్య చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. 20 లక్షల రూపాయల చెక్కును చిన్నారి చైత్ర తల్లి దండ్రులకు అందజేశారు. అయితే ఆ చెక్ ను తీసుకునేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు.

నిందితున్ని ఎన్ కౌంటర్ చేయాలంటూ మంత్రుల ముందు డిమాండ్ చేశారు. చివరకు పోలీస్ అధికారులు కలెక్టర్ నచ్చజెప్పడంతో చెక్కులు తీసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష అమలు చేస్తానని మంత్రులు హామీ ఇచ్చారు. మరోపక్క హత్య కేసులో నిందితుడిపై పోలీసులు రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు.