కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మహేశ్వర్ రెడ్డి

అంత అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ కి సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి గుడ్ బై చెప్పేసారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. తనకు అనవసరంగా షోకాజ్ ఇవ్వడం పట్ల ఆగ్రహంతో ఉన్న మహేశ్వర్ రెడ్డి గత రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఖర్గే తో కలిసి మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే నేటి ఉదయం ఆకస్మికంగా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, తరుణ్ చుగ్ లతో భేటి అయిన మహేశ్వర్ రెడ్డి.. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక లేఖను ఖర్గేకు పంపారు.

గత కొంతకాలంగా టీ కాంగ్రెస్‌లో మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న మహేశ్వర్ రెడ్డి.. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంత యాక్టివ్‌గా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో రేవంత్‌కు పోటీగా ఆయన పాదయాత్ర చేపట్టడం గుబులు రేపింది. కానీ అధిష్టానం పాదయాత్ర ఆపేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో మధ్యలోనే పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ నిర్ణయం మహేశ్వర్ రెడ్డిలో అసంతృప్తిని మరింత పెంచిందనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ బలోపేతం కోసం తాను పాదయాత్ర చేపట్టానని, తన పాదయాత్రను మధ్యలో ఆపేయాలని చెప్పడం సరికాదంటూ ధిక్కార సర్వం వినిపించారు.

ఇదే క్రమంలో మంగళవారం నిర్మల్ నియోజకవర్గంలో తన అనుచరులతో మహేశ్వర్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలోకి ఫోన్లను తెచ్చుకునేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్‌లో దుమారం రేపింది. పార్టీ మార్పుపై చర్చించేందుకు అనుచరులతో మహేశ్వర్ రెడ్డి రహస్య భేటీ నిర్వహించారని ప్రచారం ఊపందుకుంది. బీజేపీలో చేరే విషయంపై ఆయన అనుచరులతో చర్చించారని వార్తలు మీడియాలో జోరుగా వినిపించాయి. ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. కాసేపట్లో మహేశ్వర్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఆయన సమక్షంలోనే కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నిర్మల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై 2545 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో 9271 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2021 జూన్ 26న తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యాడు.