టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకం

మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం

mahender-reddy-appointed-as-tspsc-chairman

హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో సభ్యుల నియామకాన్ని పూర్తి చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి చైర్మన్‌గా ఘంటా చక్రపాణి పని చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి పని చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వంటి అంశాల కారణంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి, పాత సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు అర్హతగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్‌ సహా వివిధ పోస్టులకు దాదాపు 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లు ఉన్నారు. తాజాగా చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.