నేటి నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ : నేటి నుండి రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ, లోక్‌సభ కొలువుదీరనున్నాయి. పార్లమెంట్‌ సెషన్‌ రెండవ భాగంలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. అదే విధంగా పెరుగుతున్న నిరుద్యోగం, ఈపీఎఫ్‌ వడ్డీరేట్లు తగ్గింపు, ఉక్రెయిన్‌ అంశం, భారతీయుల తరలింపు వంటి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. జమ్ము-కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం కోసం బడ్జెట్‌ ప్రతిపాదనలు, బడ్జెట్‌సమర్పణకు పార్లమెంట్‌ ఆమోదం వంటివి కేంద్ర ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు లోక్‌సభలో జమ్ము-కాశ్మీర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భోజన విరామం తర్వాత ఈ అంశాన్ని సభలో చర్చకు తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగ (షెడ్యూల్జ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదం కోసం తీసుకొచ్చే అవకాశం ఉంది.

కాగా, బడ్జెట్ సమావేశాల తొలి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/