ముగిసిన మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mahbubnagar MLC by-election concluded

హైదరాబాద్‌ః మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో, ఆ స్థానం భర్తీకి నిర్వహించిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 100 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఏఆర్వో వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

వీరిలో కాంగ్రెస్(Congress) నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి నవీన్‌ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్‌ గౌడ్ పోటీ చేశారు. ఇద్దరు ఎంపీలు, 14 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు కలిపి మొత్తం 1,439 మంది ఓటర్లు, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్​ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్​ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ (BRS) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్య ఓటు ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో, మొదటి ప్రాధాన్యత ఓట్లను తొలుత లెక్కిస్తారు. పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే ఒక్క ఓటు అదనంగా వచ్చినా, ఆ అభ్యర్థి మొదటి రౌండ్‌లో విజయం సాధిస్తారు.

అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా తొలి ప్రాధాన్య ఓటు మాత్రమే వేయాలని అభ్యర్థించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.

సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కొడంగల్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఓటు చాలా విలువైనది. ఎన్నికలు వస్తే సెలవులొస్తాయి, తీర్థయాత్రకు వెళ్దాం అనుకుంటారు. ఎన్ని కార్యక్రమాలున్నా ఓటు వేసేందుకు కొడంగల్‌ వచ్చాను. కార్యకర్తలను కలవాలని కొడంగల్‌ వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్‌ ప్రజలు నా వెంట ఉన్నారు. నేను ప్రచారానికి రాకున్నా, నన్ను గెలిపించారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.