నాసిక్ బస్సు ప్రమాదం..10 మంది సజీవ దహనం

మహారాష్ట్రలోని నాసిక్ వద్ద జరిగిన బస్సు అగ్ని ప్రమాదం లో 10 మంది సజీవదహనమయ్యారు. నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్డులో శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. యవత్మాల్ నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. అతివేగంతో అదుపుతప్పి.. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో.. బస్సు 50 నుంచి 60 అడుగుల ముందుకు పడిపోయింది. దీంతో డీజిల్ ట్యాంకర్ పగిలిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. కొందరు ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సులో నుంచి దూకేందుకు ప్రయత్నించారు.

డోర్ నుంచి కొందరు, కిటికీల నుంచి ఇంకొందరు దూకడంతో.. వారికి కూడా గాయపడ్డాడు. ఆ తర్వాత చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులు బయటకు రాలేక.. లోపలే చిక్కుకుపోయారు. వారంతా మంటల్లో కాలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

నాసిక్ డిసీపీ అమోల్ తాంబే మాట్లాడుతూ.. కంటెయినర్‌‌ను బస్సు ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి 10 మంది చనిపోయారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నప్పుడు ప్రమాదం చోటుచేసుకోవడం వల్ల ప్రాణనష్టం అధికంగా ఉందన్నారు. ప్రమాద సమయానికి బస్సులో 50 మందికిపైగా ఉన్నట్టు ఆయన చెప్పారు. మంటల్లో చిక్కుకున్న ప్రయాాణికుల హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకుందన్నారు.