లవ్‌స్టోరి రిలీజ్ వాయిదా వేసిన కమ్ముల

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తీసే చిత్రాలను చూసేందుకు ఆడియెన్స్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. కాగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లవ్‌స్టోరి’ ఇప్పటికే ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ దిశగా వెళ్తుండటంతో ఈ ప్రభావం సినీ రంగంపై కూడా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లవ్ స్టోరి చిత్రాన్ని ముందుగా అనుకున్న విధంగా ఏప్రిల్ 16న రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు వారు తెలిపారు.

కాగా లవ్ స్టోరి తదుపరి రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ పరిస్థితులు చక్కబడ్డాక ప్రకటించనున్నట్లు తెలిపింది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని నారాయణ దాస్ నారంగ్, పి.రామ్ మోహన్ రావు సంయుక్తంగా ప్రొడ్యూ్స్ చేస్తున్నారు. మరి లవ్ స్టోరి చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.