జనం తిరగబడే రోజు దగ్గరపడిందంటూ జగన్ ఫై నారా లోకేష్ ఫైర్

చంద్రబాబు ఇంటివద్ద వైసీపీ నేతల దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఈ ఘటన ను ఇప్పటికే తెలుగుదేశం నేతలు ఖండించగా..ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. లోకేష్ మాట్లాడుతూ ప్రతిపక్షనేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేనీ, బులుగు గూండాలని పంపావంటేనే, నీ దిగజారుడుతనం అర్థమవుతోందని.. సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. జగన్ రోజురోజుకూ అధఃపాతాళంలోకి దిగజారుతున్నారన్నారు. తాడేపల్లిలోని నీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరమనే విషయం తెలుసుకునే రోజు త్వరలో వస్తుందని తెలిపారు.
జగన్ హామీలు గాలీమూటల్లా తేలిపోతుండడంతో జనం తిరగబడే రోజు దగ్గరపడిందని గ్రహించే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై వైఎస్ఆర్ ఎపుడూ ఇలా ప్రవర్తించలేదని, జగన్ తీరు చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందన్నారు.
గురువారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేస్తూ..చంద్రబాబు ఇంటిపైకి వెళ్లడం తో అక్కడ టీడీపీ కార్యకర్తలకు – వైసీపీ నేతలకు కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నెట్టువేసుకోవడం , కొట్టుకోవడం చేసారు. వైసీపీ నేతల దాడిలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు వాపోతున్నారు.