రెండేండ్ల తర్వాత ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

LG Manoj Sinha flags off first batch of Amarnath Yatra amid beefed up security

శ్రీనగర్‌: రెండేండ్ల తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి మొదటి బ్యాచ్‌ జమ్ము బేస్‌ క్యాంప్‌ నుంచి బయలుదేరింది. మూడు వేల మందితో కూడిన మొదటి బ్యాచ్‌ యాత్రను జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా బుధవారం తెల్లవారుజామున జెండా ఊపి ప్రారంభించారు. కశ్మీర్‌ లోయ ఇక బమ్‌ బమ్‌ భోలే, హర హర మహాదేవ్‌ నామస్మరణతో మారుమోగనుంది. అయితే కరోనా కారణంగా గత రెండేండ్లు అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది హిమ లింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం భావిస్తున్నది.

రెండు మార్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 48 కిలోమీటర్ల పొడవు గల నున్వాన్ నుంచి, సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్‌బాల్‌లో 14 కిలోమీటర్ల పొడవైన బల్తాల్ మార్గం ద్వారా యాత్ర సాగునుంది. 13 ఏండ్ల కంటే తక్కువ వయస్సు, 75 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని ఈ యాత్రకు అనుమతించారు. అదేవిధంగా ఆరువారాలు నిండిన గర్భిణులకు కూడా అనుమతిలేదు. ఆగస్టు 11న ఈ యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది 43 రోజులపాటు సాగే ఈ యాత్ర కోసం ఇప్పటికే మూడు లక్షలకుపైగా మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. యాత్ర ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566 బ్రాంచీల ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/