డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదాంః డీజీపీ రవిగుప్తా

Let’s all fight together to eradicate drugs: DGP Ravi Gupta

హైదరాబాద్‌ః డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులకు డీజీపీ రవిగుప్తా హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ప్రభుత్వ ఆదేశాలను చాలా సీరియస్గా తీసుకున్న మూడు కమిషనరేట్ల అధికారులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పటిష్ఠ నిఘా పెట్టారు. హైదరాబాద్ నలుమూల గట్టి నజర్ పెట్టి డ్రగ్స్ స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మరో పది రోజుల్లో నూతన సంవత్సరం వస్తుండగా న్యూ ఇయర్ ఈవెంట్లలో విపరీతంగా డ్రగ్స్ వాడకం జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్గా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టే దిశగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ఇందుకోసం నగరంలో ప్రతి హోటల్, పబ్, రెస్టారెంట్, ఇతర ప్రదేశాల్లో పటిష్ఠ నిఘా ఉంచింది. విస్తృతంగా తనిఖీలు చేస్తూ న్యూ ఇయర్ వేడుకల్లో మత్తు వాసనే రాకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ప్రజలు కూడా సహకరించి తెలంగాణకు మాదక ద్రవ్యాల నుంచి విముక్తి కలిగిద్దామంటూ తాజాగా డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు.