శంషాబాద్‌ ప్రజలు ఇక ఉపిరిపీల్చుకోవచ్చు

గత నాలుగైదు రోజులుగా రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. ఐదు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఐదు రోజుల క్రితం చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకినట్టు గమనించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలో చిరుత ఉందని తెలుసుకున్న అధికారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచారు.ఎరగా మేకను ఉంచారు. అయితే ఆ బోను వరకు వచ్చిన చిరుత తిరిగి వెళ్లిపోయింది. అధికారులతో ఆడుకున్నట్టే బిహేవ్‌ చేసింది. చివరకు ఎరగా ఉన్న మేకను తినేందుకు వచ్చి బోనులో చిక్కింది. వెంటనే చిరుతను బంధించిన అధికారులు జూ వద్దకు తరలించారు. అక్కడి నుంచి చిరుత ఆరోగ్య పరిస్థితి చూసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలిస్తామని తెలిపారు. చిరుత పిల్లలు ఉన్నాయా… వాటి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.