లియాండర్‌ పేస్‌ కథ ఇక ముగిసినట్లే?

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించిన పేస్‌ జోడి

Leander Paes
Leander Paes

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాన్ ఓపెన్‌లో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. ఒస్తాపెంకో (లాత్వియా)తో మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలోకి దిగిన లియాండర్ పేస్‌కు రెండో రౌండ్‌లో చుక్కెదురైంది. పేస్ఒస్తాపెంకో ద్వయం 2-6,5-7తో జామీ ముర్రే(యూకే) బతేనియా మట్టెక్ సాండ్స్(అమెరికా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌లో పేస్ఒస్తాపెంకో జోడీ ఒక ఎస్‌ సంధించి నాలుగు డబుల్ ఫాట్స్ చేయగా.. ప్రత్యర్థి జోడి నాలుగు ఎస్‌లు సంధించి 19 విన్నర్స్ కొట్టింది. సత్తాచాటి బలమైన షాట్లతో విరుచుకుపడిన ప్రత్యర్థి జోడీ రెండో సెట్‌‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది తర్వాత తన మూడు దశాబ్దాల ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన 46 ఏళ్ల పేస్‌కు ఇదే చివరి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ కాగా.. నిరాశే ఎదురైంది. ఇండియా టెన్నిస్ ముఖచిత్రంగా నిలిచిన పేస్.. తన సుదీర్ఘ కెరీర్‌లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. ఇందులో 10 పురుషుల డబుల్స్‌లో గెలవగా.. 10 మిక్స్‌డ్ డబుల్స్‌లో వచ్చినవి. 1996 అట్లాంట ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్.. ఓవరాల్‌గా 66 ఫ్రొఫెషనల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇక ఏడు ఒలింపిక్స్ బరిలోకి దిగిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా, భారత ఆటగాడిగా పేస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/