మునుగోడు లో టిఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్న నేతలు

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు లో ప్రచారం చేస్తున్నారు. ఇక అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలంతా కూడా మునుగోడు లోనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఊరూరా ప్రచారం చేస్తూ..ప్రతి ఇంటికి వెళ్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.

మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీ(టీ)ఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. నగరంలోని సనత్ నగర్ లో రూ. 3.87 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు.

అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను, మేలైన పాలనను అందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. బీ(టీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవతోనే మునుగోడు ప్రజలకు ఫ్లోరిన్‌ భూతం నుంచి శాశ్వత విముక్తి లభించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఫ్లోరిన్‌తో ఇబ్బందులు పడి దివ్యాంగులుగా మారిన ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాను సీఎం కేసీఆర్‌ అందజేస్తున్నారని కొనియాడారు.

మరోపక్క మరో మంత్రి ఎర్రబెల్లి ఉప ఎన్నికలో భాగంగా తనకు ఇన్‌చార్జీగా అప్పగించిన మునుగోడు నియోజకవర్గం చండూరు 2, 3వ వార్డులలో ఈరోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ అందజేస్తున్న పథకాల గురించి ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి పెద్దన్న మాదిరిగా అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, మునుగోడు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి అధికార పార్టీ అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు.