మరో వందే భారత్ రైలు ప్రారంభం

దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం కాగా..గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు నడిచే నాల్గో వందే భారత్ రైళ్లును మోడీ ప్రారంభించారు. ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని అందౌరా రైల్వే స్టేషన్‌ మధ్య నడిచే ఈ రైలును.. ఉనా జిల్లాలో ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

ఢిల్లీ-ఉనా మధ్య అందుబాటులోకి వచ్చే ఈ వందే భారత్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా వాసులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ‘‘ఢిల్లీ-ఉనా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం.. ఢిల్లీ లేదా ఇతర నగరాలకు వెళ్లే హరియాణా వాసులకు ఈ రైలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది’’ అని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరి… ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటుంది.

మరోవైపు చెన్నై- మైసూరు మధ్య ఐదవ వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది. అయితే ఇది ప్రమాదానికి గురికావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనికి రిపేర్ చేసి ట్రాక్‌ మీదకు తీసుకొచ్చారు.