ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. మొత్తం ఏడు దశలకు గాను ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తి కాగా ..జూన్ 01 న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో చివరి దశ పోలింగ్ ప్రచారం నేటితో ముగిసింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటి చేస్తున్న వారణాసి స్థానం కూడా ఉంది. జూన్ 1న ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో పోలింగ్ జరగనుంది.

ఈ చివరి దశ ఎన్నికల్లో మోడీ పోటీచేస్తున్న వారణాసి పార్లమెంటు స్థానం కూడా ఉంది. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌, పశ్చిమ బెంగాల్‌లో డైమండ్ హర్బర్‌ స్థానం నుంచి సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్‌లో పాటలీపుత్ర నుంచి జేడీయూ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌మెమోరియల్‌ వద్ద ధ్యానం చేస్తున్నారు. 2019 ఎన్నికలు ముగిశాక కేదార్‌నాథ్‌ గుహల్లో ధ్యానం చేసిన మోడీ, ఈసారి వివేకానంద రాక్‌మెమోరియల్‌ను అందుకు ఎంచుకున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.