లఖింపుర్‌ ఖేరీ ఘటన..కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్‌

Lakhimpur Kheri violence: Union Minister’s son Ashish Mishra granted 8-week bail by SC

న్యూఢిల్లీః ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్‌లో జ‌రిగిన రైతుల హ‌త్య కేసులో కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 8 వారాల పాటు బెయిల్‌ను ఇస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. 2021లో ల‌ఖింపూర్‌లో ధ‌ర్నా చేప‌డుతున్న రైతుల మీద‌కు ఆశిష మిశ్రా కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించారు. మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేసి ఆయ‌న్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆశిష్ మిశ్రా జైలులో ఉన్నారు.

బెయిల్ స‌మ‌యంలో ఆశిష్ మిశ్రా.. యూపీలో కానీ, ఢిల్లీలో కానీ ఉండ‌రాదు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా అత‌ను యూపీని వ‌దిలి వెళ్లాల‌ని కోర్టు తెలిపింది. రైతుల మ‌ర్డ‌ర్ కేసులో ఆశిష్ మిశ్రా కానీ, అత‌ని కుటుంబ‌స‌భ్యులు కానీ సాక్ష్యుల్ని ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నం చేస్తే అప్పుడు బెయిల్‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

జ‌స్టిస్ సూర్య కాంత్‌, జేకే మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిష‌న్‌పై మ‌ళ్లీ మార్చి 14వ తేదీన కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. బెయిల్ స‌మ‌యంలో ఎక్క‌డ ఉన్నాడ‌న్న విష‌యాన్ని ఆశిష్ ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుకు తెలియ‌జేయాల్సి ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/