సీఎం కేసీఆర్ తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భేటీ..

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..ఈరోజు సోమవారం టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ను కలవబోతున్నారు. కొద్దీ సేపటి క్రితమే ఆయన ప్రగతిభవన్‌కు బయలుదేరారు. మధ్యాహ్నాం 3 గంటలకు సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలవనున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే కానున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగానే కేసీఆర్‌ను కలుస్తున్నారని తెలుస్తోంది. ఉపఎన్నికలో గెలిచేందుకు కూసుకుంట్లకు కేసీఆర్ అభినందనలు తెలపనున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండు నుంచి తుది వరకు రౌండు రౌండుకూ టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ మెజార్టీని సాధించింది. కారు స్పీడుతో కమలం రేకులు రాలిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కూడా కాపాడుకోలేకపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 ఓటర్లు ఉండగా, రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. పోలైన మొత్తం ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 97,006, బీజేపీకి 86,697, కాంగ్రెస్‌కు 23,906 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 10,309 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది.