సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ

సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్‌ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీడియా యాజమాన్యాలు సహకరించకపోయినా మీడియా ప్రతినిధులు సహకారం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. జర్నలిస్ట్ లు తెలంగాణ కోసం ఢిల్లీ లో పోరాడారు. వారిని మరువలేవమని.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రజలకు మీడియా ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది సోషల్ మీడియా కాదని..యాంటీ సోషల్ మీడియానా అనే భావన కల్గుతుందన్నారు.

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనక్కి వెళ్తుందని.. కోవిడ్ సమయంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని మంత్రి నిర్మలా సీతారామన్ ని అడిగారా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే మీడియా పై దాడులు చేయడం సరికాదన్నారు. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్‌ కార్డులున్న జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నారన్నారు.