గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం జగన్

జ‌గ‌న్‌ను చూడ‌గానే బోరుమ‌న్న గౌతమ్‌రెడ్డి కుటుంబం

హైదరాబాద్ : సీఎం జగన్ గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ మేక‌పాటి కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు అంద‌రినీ క‌ల‌చివేశాయి. జ‌గ‌న్‌ను చూడ‌గానే గౌత‌మ్ రెడ్డి త‌ల్లి బోరున విల‌పించారు. గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణి, ఆయ‌న తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి కూడా జ‌గ‌న్‌ను చూడ‌గానే.. బోరున విల‌పించారు. జ‌గ‌న్‌తో గౌత‌మ్ రెడ్డి అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకున్న ఆయ‌న కుటుంబ స‌భ్యులు జ‌గ‌న్ క‌నిపించ‌గానే.. ఒక్క‌సారిగా తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న‌ను చూసిన గౌత‌మ్ రెడ్డి కుటుంబ స‌భ్యులు బోరున విల‌పించ‌డాన్ని చూసిన జ‌గ‌న్ కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. గౌత‌మ్ రెడ్డి పార్దివ దేహం ప‌క్క‌నే కుర్చీలో కూర్చున్న జ‌గ‌న్ క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న ప‌క్క‌నే ఉన్న రాజ‌మోహ‌న్ రెడ్డిని జ‌గ‌న్ ఓదార్చ‌గా.. జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి గౌత‌మ్ రెడ్డి త‌ల్లి, స‌తీమ‌ణిని ఓదార్చారు.

రేపు ఉదయం 6 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహం నెల్లూరు చేరుకోనుంది. రేపు సాయంత్రం వరకు నెల్లూరులోని ఆయన నివాసంలో సందర్శన కోసం ఏర్పాటు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుండి రేపు మధ్యాహ్నం నెల్లూరుకి రానున్నారు. బుధవారం ఉదయం స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/